వలస బతుకుల్లో ఆశల మోసులు

 అనంతపురం: ఈ ఏడాది అనంతపురం జిల్లా వ్యవసాయ ముఖచిత్రం అనూహ్యంగా మారిపోయింది. కొన్నేళ్లుగా కరువుతో అల్లాడిన జిల్లా రైతుల ముఖాల్లో ఇప్పుడు 'వర్షా'తిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వలస బాట పట్టిన రైతులు, రైతు కూలీలు సొంతూళ్లకు తరలివస్తూ పొలం బాట పడుతున్నారు. జిల్లా నుంచి ఏటా సుమారు 4 లక్షల మంది పనుల కోసం వలస వెళ్తుంటారు. వర్షపు చినుకు మీద ఆశతో పంట వేసిన రైతు.. అది పండకపోతే ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. జిల్లాలో గత ఐదేళ్లలో ఏకంగా 300 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ ఏడాది జిల్లాలో అద్భుతం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో కుంటలు, చెరువులు నిండిపోయాయి.



గత ఆగస్టులో భూగర్భ నీటి మట్టం 27.75 మీటర్ల లోతున ఉండగా... ప్రసుత్తం 19.72 మీటర్లకు చేరింది. బోర్లు రీచార్జ్‌ అయ్యాయి. జిల్లాలో 70 వేల బోర్లు రీచార్జ్‌ కాగా, భూగర్భంలో 56 టీఎంసీల నీరు ఇంకిందని లెక్కలు చెబుతున్నాయి. హంద్రీ–నీవా ద్వారా చెరువులకు నీరు విడుదల చేయడంతో అదనంగా 50 వేల ఎకరాలు, హెచ్చెల్సీ కింద అదనంగా 20 వేల ఎకరాలు సాగులోకి వచ్చింది. దీంతో ఇప్పటికే సగం మంది వలస రైతులు సొంత గ్రామాలకు తిరిగొచ్చి పంటలు సాగు చేసుకుంటున్నారు. వీటన్నింటికీ తోడు వైఎస్సార్‌ రైతు భరోసా కింద జిల్లాలో 7,12,625 మంది అన్నదాతలకు లబ్ధి కలిగింది. అమ్మఒడి, నేతన్న నేస్తం, తదితర ప్రభుత్వ పథకాలు ఆయా వర్గాల వారికి భరోసా కల్పించడంతో ఎక్కడెక్కడికో వలస వెళ్లిన వారు తిరిగి వస్తున్నారు.